గర్భం, ప్రసవం మరియు అసురక్షిత గర్భస్రావం లాంటి సమస్యలతో ప్రతి సంవత్సరం, అర మిలియన్ మంది మహిళలు మరణిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ద్వారా, ఈ మరణాల్లో చాలావరకు నిరోధించవచ్చు. ఉదాహరణకు, కుటుంబ నియంత్రణ అనేది క్రింది విధమైన గర్భం కారణంగా ఎదురుకాగల ప్రమాదాలను నిరోధించగలదు:
చిన్న వయసులో గర్భం. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళలు ప్రసవ సమయంలో చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, అప్పటికింకా వారి శరీరం పూర్తి స్థాయిలో పెరిగి ఉండదు. అలాగే, వారికి పుట్టే శిశువులు మొదటి సంవత్సరంలోనే చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
బాగా ఆలస్యంగా గర్భం. వయసు మీద పడిన మహిళలు గర్భం దాల్చినప్పుడు, వాళ్లకి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా అప్పటికే ఎక్కువమంది పిల్లలు ఉంటే, ప్రసవ సంబంధిత ప్రమాదాలు మరింత ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చాలా త్వరగా మళ్లీ గర్భం. ఒక గర్భం తర్వాత మరో గర్భానికి ముందు స్త్రీ శరీరం సిద్ధం కావడానికి సమయం కావాలి.
చాలా ఎక్కువ మంది పిల్లలు. 4 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్న మహిళ ఆ తర్వాత వచ్చే ప్రసవాల సమయంలో రక్తస్రావం మరియు ఇతర కారణాలతో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.