మీకు సరైన పద్ధతిని ఎంచుకునే సమయంలో, మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
అది గర్భధారణను ఎంత బాగా నిరోధిస్తుంది (దాని ప్రభావం) ?
మొత్తంమీద, అది STIల నుండి ఎంత మేరకు రక్షిస్తుంది?
అది ఎంత మేరకు సురక్షితమైనది? ఈ అధ్యాయంలో పేర్కొన్న ఏవైనా ఆరోగ్య సమస్యలు మీకు ఉంటే, కొన్ని రకాల కుటుంబ నియంత్రణ పద్ధతులను మీరు నివారించాల్సి రావచ్చు.
దానిని ఉపయోగించడం మీకు ఏమేరకు సులభంగా ఉంటుంది?
కుటుంబ నియంత్రణ పాటించడానికి మీ భాగస్వామి సిద్ధంగా ఉన్నారా?
మీ వ్యక్తిగత అవసరాలు మరియు ఆందోళనలు ఏమిటి? ఉదాహరణకు, మీరు కోరుకున్న సంఖ్యలో పిల్లలు ఉన్నారా లేదంటే, మీరు మీ బిడ్డకు తల్లిపాలు ఇస్తున్నారా?
ఆ పద్ధతికి ఎంత ఖర్చు అవుతుంది?
దానిని అందుకోవడం సులభమేనా? దానికోసం మీరు తరచుగా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంటుందా?
దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు (ఆ పద్ధతి కలిగించే సమస్యలు) మీకు ఇబ్బందులను సృష్టిస్తాయా?
ఈ పద్ధతులు గురించి చదవడం వల్ల, వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడంలో మీకు మరింత సహాయంగా ఉండగలదు. వివిధ పద్ధతుల గురించి మీ భాగస్వామితో, ఇతర మహిళలతో లేదా ఆరోగ్య కార్యకర్తతో మాట్లాడటానికి కూడా ఇది సహాయపడవచ్చు.
మీకు ఏ కుటుంబ నియంత్రణ పద్ధతి సరైనదో మీరు మాత్రమే నిర్ణయించగలరు.